May 24, 2026

Warangal police : వినూత్న ప్రయోగం సిగ్నల్ వద్ద చల్లని నీడ..

Warangal police : ​మండుతున్న ఎండల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిరీక్షించే వాహనదారుల కష్టాలను గుర్తించిన వరంగల్ ట్రాఫిక్ పోలీసులు అద్భుతమైన చొరవ తీసుకున్నారు. భానుడి భగభగల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సహకారంతో నగరంలోని ప్రధాన కూడళ్లలో పచ్చని షేడ్ నెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎర్రటి ఎండలో ద్విచక్ర వాహనదారులు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన వరంగల్ ట్రాఫిక్ సీఐ కోడూరు సుజాత పర్యవేక్షణలో ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. కేవలం ఆదేశాలు ఇవ్వడానికే పరిమితం కాకుండా, ఆర్ ఎస్సై సాయి కిరణ్ స్వయంగా క్రేన్ సాయంతో పైకి వెళ్లి నెట్లను కట్టడం అందరినీ ఆకర్షించింది. పోలీసులంటే కేవలం నిబంధనలు అమలు చేయడమే కాదు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుని బాసటగా నిలుస్తారనే సందేశాన్ని ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని జంక్షన్లలో ఈ గ్రీన్ మ్యాట్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుండటంతో ఎండ వేడిమి నుంచి రక్షణ దొరుకుతోందని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చిత్తశుద్ధిని, విధి నిర్వహణలో వారు చూపుతున్న అంకితభావాన్ని స్థానికులు వేనోళ్ల కొనియాడుతూ, ప్రాణాలకు తెగించి వినూత్న ఆలోచన అమలు చేసిన ఆర్ ఎస్సై సాయి కిరణ్ కృషికి సలాం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *