Farmers : సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి పథకం పై రెవిన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తుండడంపై రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలా సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని తమ భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు. నిన్నటి నుంచి మొదలైన రెవెన్యూ సదస్సులు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో భవిష్యత్తులో తేలనుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకొని వచ్చింది. ధరణి ద్వారా రైతుల భూములకు డోకా ఉండదని చెప్పింది. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణిని రద్దు చేస్తూ భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రైతుల భూ సమస్యలను పరిష్కారం చేస్తామని పాలకులు అధికారులు ప్రకటించారు. ములుగు భూపాలపల్లి మహబూబాబాద్ వరంగల్ జిల్లాల్లో చాలా సంవత్సరాలుగా రైతులు భూ సమస్యలు పరిష్కారం కాక ఆవేదనకు గురవుతున్నారు. భూభారతి పథకం అమలు చేసి సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పడంతో తమకు ఇక మోక్షం కలుగుతుందని ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా మహబూబాబాద్ గూడూరు కానాపురం ఏటూరునాగారం మంగపేట తదితర ఏజెన్సీ మండలాల్లో గిరిజనులు తమకు ప్రభుత్వం పట్టాలు ఇస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే రెవిన్యూ సదస్సులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఏజెన్సీ రైతుల సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా వారికి బ్యాంకు రుణం పొందే వీలు కలుగుతుంది. సాదా బైనామా దరఖాస్తులను కూడా పరిష్కరిస్తే వేలాది మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ