Govt school : వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు బ్యాక్‌వర్డ్ క్లాస్ ఇంటెలెక్చువల్ ఫోరం (BCIF) వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో “ప్రభుత్వ పాఠశాలల విద్యను బలోపేతం చేయడం సామాజిక బాధ్యత” అనే అంశంపై అవగాహన సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొంగ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీఐఎఫ్ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ కొంగ వీరస్వామి మాట్లాడుతూ, విద్యే సమాజంలోని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు మరియు ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి అత్యంత శక్తివంతమైన ఆయుధమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి, వారికి ఉన్నత విద్యను అందించే బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీసీఐఎఫ్ వరంగల్ జిల్లా కో-ఆర్డినేటర్ మండల పరశురాములు మాట్లాడుతూ, బలహీన వర్గాలకు విద్యే నిజమైన ఆస్తి అని అన్నారు. పేదరికం కారణంగా పిల్లలను బాల కార్మికులుగా మార్చకుండా ప్రతి కుటుంబం వారిని తప్పనిసరిగా పాఠశాలలకు పంపాలని కోరారు. విద్య ద్వారానే వ్యక్తిగత, కుటుంబ, సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు కొంగ శ్రీనివాస్ గారిని బీసీఐఎఫ్ సభ్యులు ఘనంగా శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీఐఎఫ్ హనుమకొండ కో-ఆర్డినేటర్ తుమ్మ తిరుపతి, ఉపాధ్యాయులు ఆకుతోట శ్రీనివాస్, మూల కృష్ణమూర్తి, కందగట్ల సురేష్, కాసుల శైలేందర్, వొడెల శ్రీనివాసరావు, సామల శ్రీకాంత్, బి. తిలక్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముగింపులో ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించడం, బలోపేతం చేయడం ప్రతి పౌరుని సామాజిక బాధ్యత అని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికను పెంచేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బీసీఐఎఫ్ నాయకులు తీర్మానించారు. జారీ చేసినవారు: మండల పరశురాములు జిల్లా కో-ఆర్డినేటర్, బ్యాక్‌వర్డ్ క్లాస్ ఇంటెలెక్చువల్ ఫోరం (BCIF), వరంగల్ జిల్లా
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ
