Magic Festival : ఆంధ్రప్రదేశ్ మెజీషియన్స్ అసోసియేషన్ (ఏపీఎంఏ) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాజంపేటలో 41వ మేజిక్ ఫెస్టివల్ ‘మాయాలోకం’లో వరంగల్ కు చెందిన ప్రముఖ మెజీషియన్, నేషనల్ అవార్డు విజేత శ్రీరాం కళ్యాణ్ ‘మేజిక్ స్టార్’ అవార్డుతో పాటు రూ.5,000 నగదు రివార్డును అందుకున్నారు. ఇంద్రజాల రంగంలో విశిష్ట సేవలందిస్తున్న వారికి ప్రముఖ మెజీషియన్ డా. బోస్ ప్రతి యేటా ఇద్దరికి ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ‘మేజిక్ స్టార్’ అవార్డుకు ఈ సంవత్సరం కళ్యాణ్ ను ఎంపిక చేసారు. కార్యక్రమంలో ఆయనను గజమాలతో ఘనంగా సత్కరించి, అవార్డును, నగదును ప్రదానం చేసారు. మేజిక్ రంగానికి ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా డా. బోస్ మాట్లాడుతూ ఇప్పటినుంచి ఆయనను ‘మేజిక్ స్టార్ కళ్యాణ్’గా పిలవాలని సూచించారు. అవార్డు స్వీకర్త శ్రీరాం కళ్యాణ్ మాట్లాడుతూ ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన డా. బోస్ కు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జె.వి.ఆర్, యు.పి. రాయుడు, డా.ఆర్యల్, డా.రమ్యశ్రీ, రఘుబాబు, విజయభాస్కర్ రెడ్డి, సృజన్ కుమార్ తదితర ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. మేజిక్ కళా రంగానికి సేవ చేయడానికి తన గురువు, సీనియర్ మెజీషియన్ దశరథ్, డా. బీఎన్ఎస్ కుమార్, తోటి మెజీషియన్లు నిరంతరం అందిస్తున్న ప్రోత్సాహం తనకు స్ఫూర్తినిస్తోందని కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా ఈ వేడుకలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 200 మంది ఇంద్రజాలికులు పాల్గొన్నారు 20 మంది మెజిషియన్లు ఇంద్రజాల పోటీలో పాల్గొని తమ మాయాజాల ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా కూడా కళ్యాణ్ వ్యవహరించారు
