Farmers : అయ్యో అన్నదాత..
అకాల వర్షాలతో రైతన్నలకు తీవ్ర నష్టం
ధాన్యాన్ని కాపాడుకునేందుకు వ్యయ ప్రయాసాలు
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు దిగుబడి వచ్చే సమయంలో ప్రతి ఏటా నష్టాలు వస్తున్నాయి. వారం రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిసి ముద్దయిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే బస్తాల్లో నింపిన ధాన్యం మొలకెత్తుతున్న దారుణమైన పరిస్థితులు దాపురించాయి.
ములుగు, భూపాలపల్లి జనగామ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వారం రోజుల నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కళ్ళల్లో ఉన్న యాసంగి ధాన్యం తడిసి ముద్దవుతుంది. చేతి కాడికి వచ్చిన పంట నీళ్ల పాలు అవుతుండడంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.
టెన్షన్ టెన్షన్..
కేరళ నైరుతి రుతు పవనాలు తాకాయని వాతావరణ శాఖ సమాచారంతో మరింత ఆందోళన అన్నదాతల్లో పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ను మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని సమాచారం రైతులు నిద్రపోకుండా చేస్తుంది. ఇన్ని నెలలు కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీళ్ల పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని బోరున విలపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలను వేగవంతం చేసి వెంటనే కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.
మొలకెత్తిన ధాన్యం..
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మహబూబాబాద్ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో బస్తాల్లో నింపిన ధాన్యం మొలకెత్తింది. మొలకెత్తిన బస్తాలను చూసిన రైతులు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లేనిపక్షంలో తమకు పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని బోరున విలపిస్తున్నారు.