Saraswathi pushkaralu : ఈనెల 15వ తేదీన కాలేశ్వరంలో ప్రారంభమైన సరస్వతీ నది పుష్కరాలకు భక్తులు రోజురోజుకు భారీగా తరలివస్తున్నారు. గత రెండు రోజులుగా ప్రతిరోజు సుమారు రెండు లక్షల వరకు భక్తులు పుణ్య స్థానాలు చేసి శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. నేడు ఆదివారం సెలవు రోజు కావడం రేపు పుష్కరాలకు ఆఖరి రోజు కావడంతో నేడు రేపు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలేశ్వరం త్రివేణి సంఘంలో పుణ్య స్థానాలు చేస్తున్న భక్తులు పాపాలు తొలగిపోవాలని సరస్వతి మాతను వేడుకుంటున్నారు. ప్రతి రెండేళ్లకోసారి ములుగు జిల్లా మేడారంలో జరిగే మహా జాతరకు సుమారు కోటిన్నరకు పైగా భక్తులు తరలివస్తుంటారు. అయినప్పటికీ ప్రభుత్వం అధికారులు ప్రణాళికతో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రతి జాతరను విజయవంతం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం కాలేశ్వరంలో జరుగుతున్నది పుష్కరాల్లో అధికారుల ముందస్తు ప్రణాళిక లేనట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. నేటితో పది రోజులుగా జరుగుతున్న పుష్కరాల్లో రోజుకు సుమారు లక్ష మంది నుంచి రెండు రోజులుగా రెండు లక్షల మంది వరకు తరలివస్తున్నారు. కానీ ట్రాఫిక్ సమస్యను అధిగమించడంలో మాత్రం అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా ట్రాఫిక్ సమస్య భక్తులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. శనివారం ఏకంగా ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో నిరసించిపోయిన భక్తులు కాలినడకతో కాలేశ్వరం చేరుకున్నారు. నేడు రేపు భక్తులు ఇంకా భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ పై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. మూడు రోజులుగా వన్వే ఏర్పాటు చేసినప్పటికీ ట్రాఫిక్ సమస్యను మాత్రం పరిష్కరించ లేకపోవడం గమనార్హం. కాశీ పండితులు ప్రతిరోజు కాలేశ్వరంలో నవరత్న మాల హారతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి భక్తులు పోటీ పడుతున్నారు. మూడు రోజులుగా సాయంత్రం సమయంలో కాలేశ్వరంలో వర్షం పడుతున్నప్పటికీ భక్తులు తడుస్తూ కూడా హారతి కార్యక్రమాన్ని తిలకించి తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ అవుతుండడం కాలేశ్వరం రహదారి అటవీ మార్గంలో ఉండడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి తాగునీరు ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. నేడు రేపు వెళ్లే భక్తులు ఆహారం తాగునీరు పూర్తిస్థాయిలో తీసుకుని వెళ్లాలి. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే భక్తులు రానుపోను పెట్రోల్ డీజిల్ పూర్తిస్థాయిలో నింపుకోవాల్సిన అవసరం ఉంది. కాలేశ్వరంలో పెట్రోల్ బంక్లు కూడా అన్ని వాహనాలకు అందుబాటులోకి రావడం లేదు. సెల్ఫోన్ సిగ్నల్స్ కూడా రాకపోవడం ఫోన్ పేలు పనిచేయకపోవడం కూడా భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా భక్తులు బయలుదేరితే ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండే అవకాశం ఉంది.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ