BC Declaration : నిజామాబాద్ జిల్లా ఇంచార్జీ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా కామారెడ్డి లో ఈనెల 15న నిర్వహించబోయే బీసీ డిక్లరేషన్ బహిరంగ సభను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఈరోజు నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం మరియు మీడియా సమావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య మరియు యువజన క్రీడా సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లతో కలిసి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ఇంచార్జీ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కామారెడ్డి డిక్లరేషన్ సభ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా, విద్యా ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు అమలు కొరకు తీర్మానం చేసిన విషయమును గుర్తు చేశారు. దానికి చట్టబద్ధత ఇవ్వాల్సిన కేంద్రం మోకాలడ్డుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈనెల 15వ తేదీన కామారెడ్డిలో 2 లక్షల మందితో సభ నిర్వహిస్తున్నామని, కేంద్రంపై సమర శంఖం పూరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
