Bhadrakali temple : చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్రి మహోత్సవములు ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం గం|| 04-00 లకు నిత్యాహ్నికం పూర్తిచేసిన పిమ్మట అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని కాళీ క్రమాన్ని అనుసరించి విప్రచిత్తానిత్యా గాను షోడశీ క్రమాన్ని అనుసరించి జ్ఞానశక్తిని మహావజ్రేశ్వరి గాను అంకరించి పూజారాధనలు నిర్వహించారు. ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చింది ఈ మనుష్య జన్మ పరోపకారార్థమిదం శరీరం అని శాస్త్రం చెబుతోంది. పరులకు ఉపకారం చేయాలంటే మన దగ్గర జ్ఞానం, ఐశ్వర్యం, అధికారం లేదా వృత్తి నైపుణ్యం ఈ నాలుగింటిలో ఎదోకటి ప్రధానంగా కలిగియుండాలి. ఈ నాలుగు కూడా నిరంతర సాధన కఠోర పరిశ్రమ చేస్తేనే గాని సమకూరవు. ప్రారబద్ధవశమున అసురీ శక్తులు జీవుడిలో అలసత్వం బద్ధకం రూపంలో ప్రవేశించి సాధనా మార్గం నుండి ప్రక్కకు తప్పించి ఆతతాయిగా మార్చి మానవ జీవితాన్ని వ్యర్ధపరుస్తాయి. మానవ జన్మ సార్థకం కావాలంటే సాధనా సంపత్తి కావాలి. జీవుడు సాధనలో నిమఘ్నం కావాలంటే ఈ అసురీ శక్తులు దూరం కావాలి. అందుకు జగన్మాత అనుగ్రహం కావాలి. విప్రచిత్తా అమ్మవారు బ్రాహ్మణుల బుద్ధియందు ప్రవేశించి బ్రాహ్మణులు వేదోక్త తత్త్వజ్ఞానంతో కూడిన వేదవిహిత కర్మలను ఆచరించే విధంగా చేసి తద్వారా అగ్నిష్టోమాది శ్రోతయాగాలు జరుపుచూ తద్వారా సకల జనులు తరించే విధంగా చేస్తుంది. అట్లాగే మహావజ్రేశ్వరీ మాత సాధకుడి సంకల్పాలను వజ్రసంకల్పంగా ధృఢతరం చేసి మనిషిని సాధనలో కృతకృత్యుణ్ణి చేసి ఆత్మోద్ధరణ జరుపుతుంది. అపుడు జీవుడు తాను తరిస్తూ పదిమందిని తరింపజేస్తాడు. ఈ విధంగా లోకకళ్యాణం జరుగుతుంది. జగన్మాత ఆరాధన వల్ల అని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు.