Bhadrakali Temple : చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో గత పన్నెండు రోజులుగా ఎంతో వైభవంగా నిర్వహింపబడుతున్న శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ రోజు *చక్రతీర్ధోత్సవం (చక్రస్నానం), ధ్వజ అవరోహణం, ఘటాభిషేకం పుష్పయాగంతో* సుసంపన్నమయ్యాయి. అమ్మవారికి ఉదయం గం|| 04-00లకు నిత్యాహ్నికం పూర్తిచేసిన తర్వాత స్నపనవిధి విశేష పూజాదికములు నిర్వహించి, *పూర్ణాహుతి* నిర్వహించిన పిమ్మట అమ్మవారికి *చూర్ణోత్సవం* జరిపారు. ఈ రోజు సువాసినీమణులు (ముత్తయిదువలు) అందరూ కలసి జరిపిన చూర్ణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారి అభిషేకానికి పసుపుకొమ్ములు, సుగంద ద్రవ్యాలు అన్నీ ఒకచోట చేర్చి తిరగలిలో వేసి ముత్తయిదువలు విసిరి అమ్మవారికి ఒక పాత్రలో సమర్పించారు. ఈ చూర్ణాన్నే చక్రతీర్ణోత్సవంలో మరియు అమ్మవారికి నలుగు పిండిగా ఉపయోగించి స్నపనం జరుపుతారు. చక్రతీర్థోత్సవం (చక్రస్నానం) ముఖ్య అర్చకులు శ్రీ వెంకటనాగరాజ శర్మ నేతృత్వంలో శ్రీ వేముగంటి సుధాకర్ శర్మ ద్వారా వైభవంగా నిర్వహింపబడింది. దర్శించిన భక్తులు ఒక దివ్యానుభూతికి లోనయి ఆనంద పరవశులయ్యారు. అనంతరం *భేరీతాడనం* జరిపి *ధ్వజావరోహణం* చేశారు. బ్రహ్మోత్సవ నిర్వహణలో అధికారుల, అర్చకుల, భక్తులు లేదా తదితరులెవ్వరివల్లనైనా జ్ఞాతాజ్ఞాతంగా జరిగిన పొరపాట్లు లేదా న్యూనాతరిక్త దోషాలవల్ల సంక్రమించే పాపం తొలగిపోయి బ్రహ్మోత్సవ సంపూర్ణ సాంగత్వం కలిగి భక్తులందరికీ శుభాలు ప్రాప్తింపజేయడానికి శాస్త్రంలో చెప్పబడిన ప్రకారం అమ్మవారికి *శతఘటాభిషేకం* జరిపి రాత్రి *పుష్పయాగం* నిర్వహించారు. పుష్పయాగంలో అనేకమంది భక్తులు పాల్గొన్నారు. శాస్త్రంలో చెప్పబడిన మేరకు పుష్పయాగంలో అమ్మవారికి అర్చకులు పదిసార్లు జరిపిన దశార్చనారాధన భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని ప్రసాదించింది.
ఈ రోజు ఉదయం దేవాలయములో అమ్మవారి ఊరేగింపు నిమిత్తము తన సొంత ద్రవ్యం కోటి రూపాయల వ్యయంతో వరంగల్ పశ్చిమ ఎం.ఎల్.ఏ శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ఈరోజు అడ్వాన్సుగా 45 లక్షల రూపాయలు చెల్లించి ముప్పయి అడుగుల రథం తయారీకి మహారాష్ట్ర నాగపూర్ నుండి తెప్పించిన మేలు రకం టేకు కలపతో శిల్పి గిర్మాజి ప్రవీణ్ చారి ఆధ్వర్యంలో రథం తయారీకి దేవాలయ చైర్మన్ డా|| బి. శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు శ్రీయుతులు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, జారతి వెంకటేశ్వర్లు, బింగి సతీష్, పాలడుగుల ఆంజనేయులు, అనంతుల శ్రీనివాస్, మూగా శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి శ్రీమతి రామల సునీత మరియు ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషులు పూజలు నిర్వహించి పని ప్రారంభించారు.
