ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ
సమావేశంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు
Hanumakonda District Collectorate : శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ కడియం కావ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అధికారులు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన ప్రసూతి సేవలను అందించాలన్నారు. పల్లె, బస్తీ దావఖానాల ద్వారా నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్నారు. గర్భిణీలు ఆరోగ్యవంతంగా ఉండేలా, ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిచ్చేలా వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడిఎస్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు.
మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, శాఖ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. బాల్యవివాహాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడి కేంద్రాలపై జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
జాతీయ విద్యా విధానం ప్రకారం స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం కూడా లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్స్ ప్రారంభించినట్లయితే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నమోదు శాతాన్ని మరింత పెంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.