Food is Medicine : గీసుగొండ మండలంలోని వివిధ పాఠశాలల సీసీహెచ్ ఉద్యోగులు, ప్రధానోపాధ్యాయుల కోసం ధర్మారం ఉన్నత పాఠశాలలో బుధవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి యాపా సంబయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన యాపా సంబయ్య మాట్లాడుతూ, విద్యార్థులకు అందించే భోజన నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై శిక్షణలో నేర్చుకున్న అంశాలను అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. ఈ చర్యలతో పిల్లల పోషకాహారం మెరుగవుతుందని, చదువుపై ఆసక్తి పెరిగి డ్రాపౌట్‌లు తగ్గుతాయని తెలిపారు.
జిల్లా పరిషత్ హై స్కూల్ ధర్మారం మరియు జెడ్‌పిహెచ్‌ఎస్ కాంప్లెక్స్‌ల నుండి వచ్చిన రిసోర్స్ పర్సన్స్ కటంగూరు రామగోపాల్ రెడ్డి మరియు గుండు విఠోభ పవార్ పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారా శిక్షణ ఇచ్చారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, విద్యార్థులకు వేడిగా భోజనం అందించడం, సరైన విధంగా చేతులు కడగడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. పురుగులు ఉన్న బియ్యాన్ని వాడరాదని, గిడుగు వ్యాధులు నివారించేందుకు రేషన్ సరుకులు మరియు బియ్యం సంచులను బెంచిలపై ఉంచాలని, వండే ముందు బాగా కడగాలని సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించేందుకు తల్లిదండ్రులు పాఠశాలలను తరచూ సందర్శించాలని, వంటవాళ్లను బాధ్యతగా వుంచుతూ సంబంధిత రిజిస్టర్లు నింపాలని తెలిపారు. గుడ్డు పంపిణీ రోజుల్లో కూర మరియు సాంబార్ తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు సమన్వయంగా నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజూ ఒక విద్యార్థి, ఎంఢిఎం ఇన్‌చార్జ్, అసిస్టెంట్ టీచర్, ప్రధానోపాధ్యాయులు భోజనాన్ని రుచి చూసి రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రిన్సిపల్ సంపత్ రావు, సీఆర్‌పీలు వెంకన్న, సుధాకర్, రవి, రిసోర్స్ సెంటర్ సిబ్బంది రాజగోపాల్, సారిక ఇతరులు పాల్గొన్నారు.