MP Vaddiraju Ravichandra : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కర్ణాటకలోని కొడగు (కూర్గ్)లో పర్యటిస్తున్నారు. పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులు తమ అధ్యయన యాత్రలో భాగంగా శనివారం దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ఒకటైన కూర్గ్ చేరుకున్నారు. స్థాయి సంఘం నాలుగు రోజుల అధ్యయన యాత్ర కర్ణాటకలోని మంగళూరులో శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసింది. కూర్గ్ చేరుకున్న సంఘం సభ్యులు ఛైర్మన్ సునీల్ తర్కరే అధ్యక్షతన మెడికెరి (మెరికర) పట్టణంలో సమావేశమయ్యారు. ఆయిల్, గ్యాస్ ఉత్పత్తులను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లి నాణ్యమైన, మెరుగైన సేవలందించే అంశాలపై సమావేశంలో చర్చించారు.
నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ, ఎలాంటి కల్తీ కి తావు లేకుండా, ప్రమాదాలకు చోటివ్వకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా.. ప్రమాదాల నివారణకు వినియోగదారులలో మరింత అవగాహన పెంపొందించాల్సిందిగా ఎంపీ వద్దిరాజు సమావేశంలో పలు సలహాలిచ్చారు. ఈ సమావేశంలో స్థాయీ సంఘం సభ్యులతో పాటు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ ఆథారిటీ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తదితర చమురు సంస్థలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.