MP Vaddiraju : హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఒక ప్రకటనలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా,రైతు, యువజన,విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న కౌశిక్ రెడ్డిపై పాలకులు అక్రమ కేసులు బనాయించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. పాలకుల తప్పిదాలను ప్రశ్నించే,ఎత్తిచూపే సోషల్ మీడియా వారియర్స్, ప్రజాస్వామికవాదులు, బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని ఎంపీ రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని ఆవేదన వెలిబుచ్చారు. ఇకనైనా ఇటువంటి కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలికి రాష్ట్రాభివృద్ధి,ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాల్సిందిగా పాలకులకు ఎంపీ వద్దిరాజు సూచించారు.