Kakatiya Capital : ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవీశరన్నవరాత్రలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం గంటలు 04-00లకు నిత్యాహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారిని మహాలక్ష్మి గా అలంకరించి పూజారాధనలు జరిపారు. మంత్రదీక్ష తీసుకొనిన సాధకుడు మంత్రానుష్ఠానం చేస్తుండగా అమ్మవారు ధనమూలమిదం జగత్ అని కదా అందుకోసం సాధకుడి అనుష్ఠానం పట్ల ప్రసన్నమైన అమ్మవారు సాధకుడికి అమితమైన ఐశ్వర్యాన్నిస్తుంది అనటానికి సంకేతంగా అమ్మవారిని మహాలక్ష్మి గా అలంకరించడంలోని నేపథ్యం. నవరాత్రులలో మహాలక్ష్మీరూపం లో దర్శించిన భక్తులకు అఖండలక్ష్మీ ప్రాప్తి కలిగిస్తుంది. నవదుర్గా కల్పోక్త నవరాత్ర పూజా విధానాన్ని అనుసరించి అమ్మవారిని కూష్మాండీ మరియు గిరిజా క్రమాలలో పూజారాధనలు జరిపారు. ఈ రోజు సాధకుని మనస్సు అనాహత చక్రం నందు స్థిరమౌతుంది. కావున ఈ దినమున సాధకుడు మిక్కిలి పవిత్రమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపాన్ని ధ్యానిస్తూ పూజలు జరపాలి. తద్వార అమ్మవారు భక్తుడి ఉపాసనకు పరితృప్తయై అసరీ శక్తులను భక్తులనుండి దూరం చేస్తుంది. గిరిజా క్రమంలో ఆరాధింపబడిన అమ్మవారు సాధకులకు సకల సౌభాగ్యాలు ప్రాప్తింప జేస్తుంది. ఈరోజు అమ్మవారిని ఉదయం సూర్యప్రభ వాహనం మీద సాయంకాలం హంస వాహనం మీద ఊరేగింపు జరిపారు. ఉదయం సూర్యప్రభ వాహనం మీద సావిత్రిగా అలంకరించి సాయంకాలం హంస వాహనంపై బ్రాహ్మీమాతగా అలంకరించి ఊరేగించారు. సూర్యప్రభ వాహనం మీద సావిత్రి మాతగా ఊరేగుతున్న అమ్మవారిని దర్శించిన వారికి ధర్మ శ్రద్ధ ఏర్పడుతుంది. యతో ధర్మ స్థతో జయః అని కదా శాస్త్ర వచనం. ధర్మాన్ని నమ్ముకున్నవాడు విజయం సాధిస్తాడు. అట్లాగే హంస వాహనం మీద బ్రాహ్మీమాతగా ఊరేగుతున్న అమ్మవారిని దర్శించడం వలన మేధాశక్తి కలిగి ఉంటాడు. మంచి, చెడు విచక్షణ కలిగి ఉంటారు.
ఈరోజు కార్యక్రమాలకు ఉభయ దాతలుగా శ్రీ నాగభూషణం శ్రీదేవి దంపతులు మరియు శ్రీ శ్రీకళ సారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ హనుమకొండ వారి అధినేతలు శ్రీ పింగిలి పవన్ కుమార్ రెడ్డి శ్రీలత దంపతులు వ్యవహరించారు. దేవాలయానికి తైలవర్ణాలంకరణ చేసిన దాతలు శ్రీ కుందూరు వినయ్ నారాయణరెడ్డి దంపతులకు అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు మహదాశీర్వచనం నిర్వహించి దేవాలయ ధర్మకర్తలు అమ్మవారి శేష వస్త్రాలను బహుకరించి ప్రసాదములు అందజేశారు. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు దేవాలయానికి పోటెత్తారు. సాయంకాలం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హరికథ, భక్తి సంగీతం, కర్నాటక సంగీతం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఎంత గానో అలరించాయి.