Bhadrakali Temple : శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు తిథి అష్టమి జ్యోతిశ్శాస్త్రం ప్రకారం ఈ తిథికి అధిదేవుడు శంకరుడు. అట్లాగే దశమహావిద్యలలోని కాశీ క్రమాన్ని అనుసరించి అష్టమికి అధిదేవత ఉగ్రప్రభా, షోడశీ క్రమానుసారం త్వరితామాత నిత్యా ఉదయం గం॥ 04-00లకు నిత్యాహ్నికం పూర్తి చేసిన పిమ్మట అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని కాళీ క్రమాన్ని అనుసరించి ఉగ్రప్రభా గాను షోడశీ క్రమాన్ని అనుసరించి జ్ఞానశక్తిని త్వరితామాత గాను అంకరించి పూజారాధనలు నిర్వహించారు. అమ్మవారి విభూతియైన ఈ ఉగ్రప్రభా మాతకే ప్రత్యంగిరా అను నామాంతరం కూడా ఉంది. ప్రళయకాలమునందలి అగ్నితో సమములగు శరీరకాంతులతో ప్రకృతిని, ప్రాణికోటిని బాధించే శక్తులను ఈ మాత నుండి ప్రజ్వల్లిల్లే ప్రళయకాలాగ్ని వంటి బ్వాలలు సంహరిస్తాయి. పాడిపంటలకు కీడు తలపెట్టు అసురీశక్తులను నశింపజేస్తుంది. జన్మజన్మాంతరములనుండి సంక్రమించిన పాపం వల్ల భూతగణముచే పీడింపబడుచున్న జీవుల పాపమును నశింపజేసి మనుష్ములను పీడిస్తున్న అసురీ శక్తులను దూరం చేసి కాళికా భక్తులకు వరాలిస్తుంది ఈ మాత సకల విధముల అభయమును ప్రసాదించి భక్తుల మనోరథములీడేరుస్తుందని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు.
ఈ రోజు దేవాలయములో శాకంభరీ రోజున జరుపవలసిన ఏర్పాట్ల నిమిత్తం అత్యవసర సమావేశము ఏర్పాటు చేయనైనది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు శ్రీ తొనుపునూరి వీరన్న ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగ్ సతీష్, మోతుకూరి మయూరిరామేశ్వర్రావు, గాండ్ల స్రవంతి, పాలడుగు అంజనేయులు, కారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్ రావు, ఈ.ఓ శ్రీమతి శేషభారతి మట్వాడ సి.ఐ శ్రీ గోపి, ట్రాఫిక్ ఎస్.ఐ శ్రీ సాయికిరణ్ నేతృత్వంలో శాకంభరీ రోజున ఆలయమునకు విచ్చేయు భక్తులకు క్యూలైన్లు, మంచినీటి వసతి మరియు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జరుపవలసిన ఏర్పాట్లు చర్చించి దేవాలయమును పరిశీలించారు. గత సంవత్సరం ఉత్సవాలలో చిన్నచిన్న లోటుపాట్లు ఈ సంవత్సరం జరుగకుండా వాటర్ ప్రూఫ్ పెండాల్స్ మరియు ఎక్జి క్యూ లైన్లు ఏర్పాట్లు మరియు భక్తులకు ఉచితముగా ప్రసాదములు, వాటర్బాటిల్స్, బాదంమిల్క్, మజ్జిగ పంపిణీ చేయుటకు నిర్ణయించారు. ప్రసాద విక్రయ కౌంటర్లు కూడా అదనముగా ఏర్పాటు చేయుటకు నిర్ణయించారు. ఈ నెల 10వ తారీకు శాకంభరీ రోజున అమ్మవారి దర్శనమునకు విచ్చేయు భక్తులు అమ్మవారి అర్చ్ అనగా పాలిటెక్నిక్ ప్రక్కగా ప్రవేశించి దర్శనం అనంతరం కాపువాడ మీదుగా వెళ్ళుటకు వన్ వే ఏర్పాటు చేయుటకు నిర్ణయించారు.