Bhadrakali Temple : కాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాచంని వరంగల్ మహానగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం గం|| 04-00లకు నిత్యాహ్నికం పూర్తిచేసిన పిమ్మట అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని కాళీ క్రమాన్ని అనుసరించి ఉగ్రా మాత నిత్యా గాను షోడశీ క్రమాన్ని అనుసరించి జ్ఞానశక్తిని శివదూతీమాత గాను అలంకరించి పూజారాధనలు నిర్వహించారు. ఏ తిథికి ఏ దేవత అధిదేవతో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ రోజంతా శుభప్రదమౌతుందని జ్యోతిశ్శాస్త్రం చెప్పడం వల్ల భక్తులందరికీ ఈ రోజు శుభప్రదం కావాలని ఆలయంలో అర్చకులు ముందుగా సూర్యోపాసన చేశారు. దశమహావిద్యలలోని కాళీ క్రమాన్ని అనుసరించి సప్తమి తిథికి అధిదేవత ఉగ్రామాత, ఈమెను ఉగ్రతారా అని కూడా అంటారు. ఈమెయే శ్రీరాముని చైతన్య శక్తిగా తంత్రాలు చెబుతున్నాయి. ఈమెను ఉపాసించిన వారికి సామ్రాజ్యైశ్వర్యము, శత్రువిజయము, కలుగుతాయి. అట్లాగే షోడశీ క్రమాన్ని అనుసరించి సప్తమికి అధిదేవత శివదూతి అమ్మవారు. అమ్మవారి జ్ఞానశక్తిని శివదూతిమాతగా అలంకరించి ఆరాధించారు. అమ్మవారు రాక్షసులను పాతాళానికి వెళ్ళిపోయి జీవించమని తనమాటగా చెప్పమని శంకరుని శుంభాసురుని దగ్గరికి దూతగా పంపుతుంది. అప్పటి నుండి అమ్మవారిని శివదూతిగా శాస్త్రాలు కీర్తించాయి. శివదూతి అమ్మవారిని సేవించడం వల్ల అపరిష్కృతంగా ఉన్న వ్యవహారాలన్నీ చక్కబడతాయని ఆలయ ప్రధానార్ధకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. ఈ రోజు వర్షం కురుస్తున్నాకూడా భక్తులు దేవాలయమునకు అధిక సంఖ్యలో వచ్చారు. దేవాలయమును సందర్శించిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవాలయ ధర్మకర్తలు శ్రీ తొనుపునూరి వీరన్న, శ్రీమతి గాండ్ల స్రవంతి, శ్రీ అనంతుల శ్రీనివాస్, ఆలయ ఈఓ శ్రీమతి శేషుభారతి తదితరులు పర్యవేక్షించారు.