Rainy season : వారం రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు కురుస్తున్న వర్షాలతో ములుగు భూపాలపల్లి ప్రాంతాల్లో ఏజెన్సీ పల్లెలు మంచం పట్టాయి. పల్లెల్లో జ్వరాలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు ప్రధానంగా గిరిజనులు జ్వరంతో మూలుగుతున్నారు. వర్షాకాలం మొదలైందంటే చాలు ప్రతి సంవత్సరం ములుగు ఏటూరునాగారం భూపాలపల్లి తాడ్వాయి మంగపేట మహాదేవపూర్ కాటారం ప్రాంతాల్లో ప్రజలు జ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ సంవత్సరం ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే జ్వరం బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వర్షాలతో తాగునీరు కలుషితం కావడంతో వీరు అనారోగ్యాల పాలు అవుతున్నారు. స్థానికంగా కొంతమంది నాటు వైద్యంతో పాటు ఆర్ఎంపీలను ఆశ్రయించి వైద్యం పొందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తే గిరిజనులకు ఉపయోగకరంగా ఉంటుంది. అనారోగ్యానికి గురైన వారు స్థానికంగా మెడిసిన్ తో పాటు వైద్యం పొందే అవకాశం ఉంటుంది. జ్వరాల తీవ్రత స్థాయి పెరగకముందే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్