Collector Sneha Shabarish : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం హనుమకొండ హసన్పర్తి మండలం పెంబర్తి గ్రామంలో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు స్లాబ్ నిర్మాణాలు, రూఫ్ లెవెల్, బేస్మెంట్ లెవెల్ వరకు చేరుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు జిల్లా కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇండ్ల నిర్మాణ పనులను ఏ విధంగా చేయిస్తున్నారని, మేస్త్రీలు ఇంటి నిర్మాణానికి ఎంత తీసుకుంటున్నారు, నిర్మాణ పనులను ఎప్పటి వరకు పూర్తి చేస్తారని, ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఫోటో క్యాప్చర్ చేస్తున్నారా అని లబ్ధిదారులు స్వరూప, రజిత, నిర్మల, అరుణ, సమ్మక్క, మంజుల, సులోచన, రాజేశ్వరిలను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు దశలవారీగా బిల్లులు అందుతాయని, కాబట్టి లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గృహనిర్మాణ శాఖ పిడి రవీందర్, డీఈ సిద్ధార్థ నాయక్, డిప్యూటీ తహసిల్దార్ రహీం పాషా, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఇతర అధికారులతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.