Bhoobharathi Revenue Conferences : రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భారతి చట్టాన్ని అమలు చేస్తుందని, భూ సమస్యలున్నవారు భూభారతి రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం సూదన్ పల్లి లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రెవెన్యూ అధికారులు భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న రైతులు, స్థానికులతో కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి భూ సమస్య ఉందని, కాస్తులో ఉన్నారా, సాదాబైనామాకు దరఖాస్తు చేశారా, భూములు అమ్మిన వారికి పాసు బుక్కులు ఉన్నాయా లేదా, భూములకు సంబంధించి ఎలాంటి ఆధారాలతో క్రయవిక్రయాలు చేశారు, తదితర భూ సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో భూ సమస్యను గురించి దరఖాస్తు చేసుకున్నట్లయితే, తహసీల్దార్ సంబంధిత సమస్యపై విచారణ సాగిస్తారని రైతులు, స్థానికులకు సూచించారు. రైతులు తమ భూ సమస్యను పేర్కొంటూ రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా స్థానికులు తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని, ఇండ్ల కోసం దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ ఎండి. రహీం పాషా, ఆర్ఐ ఫాజిల్, గృహనిర్మాణ శాఖ అధికారులు రవీందర్, సిద్ధార్థ నాయక్, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఇతర అధికారులు, రైతులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.