SR University : హసన్‌పర్తి శివారులోని అనంతసాగర్‌లో ఉన్న ఎస్‌ఆర్ యూనివర్సిటీ ప్రాంగణం విద్యార్థుల ఉత్సాహం, సాంస్కృతిక వైభవంతో కళకళలాడింది. యూనివర్సిటీ వార్షిక సాంస్కృతికోత్సవమైన స్పార్క్‌రిలో ’26 వేడుకలు జనవరి 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. వేడుకల ప్రారంభ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. పి. వెంకట రమణ రావు దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీన్ – ఆపరేషన్స్ & గ్రోత్ డా. ఆర్. అర్చనా రెడ్డి, డీన్ – స్టూడెంట్స్ వెల్ఫేర్ డా. ఏ.వి.వి. సుధాకర్ గారు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. అలాగే స్టూడెంట్ కౌన్సిల్ కన్వీనర్లు ఎల్. రిషింద్రసాయి, ఏ. సంతోషిని రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డా. పి. వెంకట రమణ రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి స్పార్క్‌రిలో వంటి సాంస్కృతిక వేడుకలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
ఈ వేడుకల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జట్టు భావన, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్న విద్యార్థి నిర్వాహకులు, సాంస్కృతిక కమిటీలు, అధ్యాపకులు మరియు సహాయక సిబ్బందిని ఆయన అభినందించారు. డా. ఏ.వి.వి. సుధాకర్, మాట్లాడుతూ తరగతి గదులకు బయట విద్యార్థులు ఆనందం, సృజనాత్మకత, స్నేహభావం, ప్రేరణను అనుభవించే వేదికగా స్పార్క్‌రిలో నిలుస్తుందని తెలిపారు. ఈ మూడు రోజులు ప్రతి క్షణాన్ని విద్యార్థులు ఆనందంగా ఆస్వాదించాలని ఆయన ఆకాంక్షించారు. డా. ఆర్. అర్చనా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇలాంటి వేడుకలు అవసరమని ఆమె పేర్కొన్నారు. స్పార్క్‌రిలో ’26 మొదటి రోజున మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, ఓపెన్ మైక్, రాంప్ వాక్, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ వద్ద విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రకాల వంటకాలను ఆస్వాదించారు. మొదటి రోజు “ఎథ్నిక్ రాయల్” థీమ్‌తో విద్యార్థులు, అధ్యాపకులు సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. రెండో రోజు లైవ్ డీజే కార్యక్రమాలు నిర్వహించనుండగా, మూడో రోజు ప్రముఖ నృత్యకారుడు పాండు మాస్టర్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. అనంతరం ఇండియన్ ఐడల్ గాయకుడు శ్రీరామ్ చంద్ర సంగీత ప్రదర్శనతో స్పార్క్‌రిలో ’26 వేడుకలు ఘనంగా ముగియనున్నాయి. సృజనాత్మకత, ఐక్యత, విద్యార్థి ప్రతిభకు ప్రతీకగా నిలిచే స్పార్క్‌రిలో ’26 వేడుకలు ఎస్‌ఆర్ యూనివర్సిటీ విద్యార్థుల జీవితంలో మధుర జ్ఞాపకాలుగా నిలవనున్నాయి.



