October 21, 2026

Hyderabad : ఎస్ఆర్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కు డీమ్డ్-టు-బి యూనివర్సిటీ హెూదా…

Hyderabad :  హైదరాబాద్ లోని ఎస్ఆర్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్ఆర్ఏహెచ్ఈ)కు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చట్టం, 1956లోని సెక్షన్ 3 ప్రకారం డీమ్డ్-టు-బి యూనివర్సిటీ హెూదాను మంజూరు చేసిందని ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్, యూనివర్సిటీ చాన్సలర్ ఎ. వరదా రెడ్డి తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ విజన్-2047 సాధనలో వ్యూహాత్మక పాత్ర పోషించే సంస్థగా ఎస్ఆర్ఏహెచ్ఈ రూపుదిద్దుకుంటోందని, సంప్రదాయ ఉన్నత విద్యకు మించి, హైదరాబాద్ లోని అత్యాధునిక సాంకేతికత, జీవ శాస్త్రాల వ్యవస్థకు కీలకమైన విద్యా, ఆవిష్కరణల కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అత్యాధునిక ఇంజినీరింగ్, డిజిటల్ ఆరోగ్య సంరక్షణ, మానవీయ సృజనాత్మక విద్యలు కలిసివచ్చేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బహుశాఖ ప్రయోగ – ఆవిష్కరణల వేదికను నిర్మించడం, తద్వారా మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత సంక్లిష్టమైన సవాళ్లకు పరిష్కారాలను అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని తెలిపారు. విభాగాల మధ్య అనుసంధానం లేని సంప్రదాయ విద్యతో భారతదేశం తదుపరి సాంకేతిక ప్రగతిని సాధించడం సాధ్యం కాదని,హైదరాబాద్ లోని ఇప్పటికే ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమలు, ఆవిష్కరణల వ్యవస్థతో నేరుగా అనుసంధానమై, ఆచరణాత్మక ఆవిష్కరణలకు చోదకశక్తిగా ఈ విశ్వవిద్యాలయం పనిచేయనుందన్నారు. టీ-హబ్ లోని పారిశ్రామిక ఆవిష్కరణల చైతన్యం, ఆదిభట్లలోని ఏరోస్పేస్ పరిశ్రమలు, జీనోమ్ వ్యాలీలోని జీవవైద్య రంగ బలాలను అనుసంధానించే వేదికగా నిలవనుందని, క్వాంటం కంప్యూటింగ్ పరిశోధకుడు, వైద్య పరిశోధకుడు, నైతికతపై అధ్యయనం చేసే నిపుణుడు కలిసి పనిచేస్తూ, బాధ్యతాయుతమైన, దేశీయ స్వావలంబనకు తోడ్పడే సాంకేతికతలను అభివృద్ధి చేసే సహకార ప్రాంగణంగా దీనిని రూపొందిస్తున్నామన్నారు.

వాస్తవ ప్రపంచ సవాళ్లను దృష్టిలో ఉంచుకున్న విద్యా కార్యక్రమాలైన కృత్రిమ మేధ, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ సాంకేతికతలు ఎస్ఆర్ఏహెచ్ఈ బహుశాఖ విద్యా దార్శనికతకు పునాదిగా నిలుస్తాయని, ఇవి విద్యను జాతీయ ప్రాధాన్యాలు, సమాజ అవసరాలతో అనుసంధానిస్తాయన్నారు.

జాతీయ విద్యా విధానం (ఎస్ఈపీ) 2020కు అనుగుణంగా, విద్యార్థులు తరగతి గది అభ్యసనంతోపాటు పరిశ్రమల ప్రాజెక్టులు, ఇంటర్న్ షిప్లు, ఔత్సాహిక పారిశ్రామిక కార్యకలాపాల్లో పాల్గొంటారని తెలిపారు. విమర్శనాత్మకంగా ఆలోచిస్తూ, విభిన్న రంగాలతో కలిసి పనిచేస్తూ, వాస్తవ సమస్యలకు పరిష్కారాలను కనుగొనే పట్టభద్రులను తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు.

 

ప్రధాన దృష్టి : భారతదేశాన్ని సాంకేతిక సేవల కేంద్రం నుంచి ప్రపంచ స్థాయిలో మేధోసంపత్తిని సృష్టించే దేశంగా తీర్చిదిద్దడం. సెమీకండక్టర్ డిజైన్, క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ, డిజిటల్ ట్విన్స్, అధునాతన రోబోటిక్స్ వంటి వ్యూహాత్మక రంగాలకు పాఠ్యప్రణాళికలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయం ముందుకు సాగనుందని,పట్టాలను అందించడంతోపాటు పేటెంట్ల సృష్టి, డీప్టెక్ స్టార్టప్ల అభివృద్ధికి ప్రోత్సాహం, దేశీయ అవసరాలకు అనుగుణమైన హార్డ్వేర్ పరిష్కారాల రూపకల్పన ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయన్నారు.

*భావితర ఆరోగ్య సంరక్షణకు సమగ్ర అనుసంధానం*

ఇంజినీరింగ్ పద్ధతులను జీవ శాస్త్రాలతో అనుసంధానించి, డిజిటల్ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తుకు బాటలు వేయడం, జీనోమ్ వ్యాలీకి సమీపంలో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అనుబంధ ఆరోగ్య శాస్త్రాలను కృత్రిమ మేధ ఆధారిత వ్యాధి నిర్ధారణ, బయోఇన్ఫర్మాటిక్స్, రోబోటిక్ శస్త్రచికిత్స శిక్షణతో అనుసంధానించే వినూత్న విద్యా కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ అంతరశాఖ సమన్వయం దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను, ఆరోగ్య రంగ సిబ్బంది శిక్షణను ఆధునికీకరించేందుకు దోహదపడుతుందని తెలిపారు.

*స్టెమ్ విద్యతో మానవీయ – సృజనాత్మక విద్యల సమన్వయం*

నైతిక విలువలతో కూడిన ఆవిష్కర్తలను తీర్చిదిద్దడం, అత్యంత శక్తివంతమైన ఆధునిక సాంకేతికతలను సమర్థంగా వినియోగించాలంటే మానవ జీవితం, సామాజిక పరిస్థితులపై లోతైన అవగాహన అవసరమని,
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విద్యలో మానవీయ శాస్త్రాలు, సమాజ శాస్త్రం, భారతీయ సాంస్కృతిక వారసత్వం, లిబరల్ ఆర్ట్స్ ను సమగ్రంగా అనుసంధానిస్తున్నామని, కృత్రిమ మేధ అల్గారిథమ్ల సామర్థ్యంతోపాటు, వాటిని విస్తృత స్థాయిలో వినియోగించడం వల్ల సమాజంపై కలిగే ప్రభావాలను అర్థం చేసుకునే నాయకులను తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు.

*విద్యాసంస్థల నిర్మాణంలో ఐదు దశాబ్దాల ప్రస్థానం*

ఐదు దశాబ్దాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 200కు పైగా విద్యాసంస్థలను స్థాపించిన ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటైన సరికొత్త సంస్థ ఎస్ఆర్ఏహెచ్ఈ అని,
అకాడమీకి చెందిన ప్రముఖ సంస్థ ఎస్ఆర్ యూనివర్సిటీ, వరంగల్, జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో వరుసగా నాలుగు సంవత్సరాలు దేశంలోని అత్యుత్తమ 100 ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో స్థానం సాధించిందన్నారు. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో 801–1000 స్థానాల శ్రేణిలో, ద సస్టైనబిలిటీ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2026లో 401–600 స్థానాల శ్రేణిలో, యూఐ గ్రీనె మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో 540వ స్థానంలో నిలిచింది. విశ్వవిద్యాలయానికి చెందిన ఎస్ఆర్ఐహెచ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ 170కు పైగా స్టార్టప్లకు సహకారం అందించిందని తెలిపారు.

*చాన్సలర్ ఎ.వరదారెడ్డి గారు మాట్లాడుతూ*

“విద్యారంగంలో తన యాభై సంవత్సరాల అనుభవంలో అనేక ఆవిష్కరణలను చూశానని, కొత్త విద్యాసంస్థలు, కొత్త సాంకేతికతలు, కొత్త బోధనా పద్ధతులు వచ్చాయని, అయితే, ఎస్ఆర్ఏహెచ్ఈ ఒక ముఖ్యమైన ముందడుగు అని, ఎందుకంటే, తొలిసారిగా గతంలోని విద్యా విషయాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తు సవాళ్లను కేంద్రంగా చేసుకుని ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడ ఒక ఇంజినీర్ ఆరోగ్య రంగ నిపుణుడితో కలిసి నేర్చుకుంటాడని,కంప్యూటర్ శాస్త్రవేత్త మన వారసత్వాన్ని పరిరక్షించే కళాకారుడితో కలిసి అభ్యసిస్తాడని తెలిపారు.ఎస్ఆర్ఏహెచ్ఈ మేడ్చల్ జిల్లా, కీసర మండలం, రాంపల్లి దాయరలో, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉందని, దేశంలోని ప్రముఖ సాంకేతిక, ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణల కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ కు చేరువలో ఈ విశ్వవిద్యాలయం ఉందని తెలిపారు.
కార్యక్రమం లో ఎస్ ఆర్ యూనివర్సిటీ ఛాన్సలర్ వరద రెడ్డి,ప్రో ఛాన్సలర్ ఎ మధుకర్ రెడ్డి,
వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్, ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి మహేష్, డీన్ ఆపరేషన్స్ గ్రోత్ డాక్టర్ ఏ అర్చన రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *