Congress : అధ్యక్షుల ఎంపిక ఎప్పుడో..
ఆశగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నాయకులు..
10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నూతన ఉత్సాహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపికలో అధిష్టానం తాత్సారం చేస్తుండడం కార్యకర్తలకు నాయకులకు నిరుత్సాహం అలుముకుంటుంది. రేపు మాపు అంటూ నెలల తరబడి ఈ ప్రక్రియను అధిష్టానం సాగదీస్తోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ప్రచారం నేపథ్యంలో కొత్త అధ్యక్షులతో ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయాల్లో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. జిల్లాకు ముగ్గురు చొప్పున పేర్లను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఆ ఒక్కరు ఎవరని తేల్చడంలో మాత్రం తాత్సాహం చేస్తుంది. దీంతో ఆశావాహుల్లో నిరాశలు అలుముకుంటున్నాయి.
ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులేనా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ని ఆరు జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను మారుస్తారా అనే చర్చ జరుగుతుంది. అయితే ములుగు వరంగల్ రెండు జిల్లాలకు ప్రస్తుతం ఉన్న అశోక్ ఎర్రబెల్లి స్వర్ణ లను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా జనగామ హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి మానుకోట జిల్లా పార్టీ అధ్యక్షులను మార్చి కొత్తవారికి అవకాశాలు ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం జనగామ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొమ్మూరి ప్రతాపరెడ్డిని తప్పించి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జి ఝాన్సీ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని బలంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఝాన్సీ రెడ్డి కుటుంబం సన్నిహితంగా ఉండడంతోపాటు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్లే వచ్చి భారత పౌరసత్వం విషయంలో చేజారిన విషయం తెలిసింది. దీంతో కోడలు యశస్విని రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి పాలకుర్తిలో గెలిపించారు. జనగామ జిల్లాలో పాలకుర్తి స్టేషన్గన్పూర్ జనగామ ఉండగా ప్రధానంగా ఝాన్సీ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ర్రెడ్డి ప్రస్తుతం ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయన స్థానంలో ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే నాయిని ఎవరి పేరును సూచిస్తారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. భూపాలపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయన నామినేటెడ్ పోస్టులో సైతం ప్రస్తుతం ఉన్నారు. దీంతో జిల్లా పార్టీ అధ్యక్షులుగా మరొకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించిన వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంథని నియోజకవర్గానికి సంబంధించిన కాటారం మల్హ ర్ మహదేవ్పూర్ మహాముత్తారం పలిమేల మండలాలు సైతం భూపాలపల్లి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో మంథని ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు సైతం పలు సూచనలు చేసే అవకాశాలు లేకపోలేదు.