Operation Sindhur : న్యూఢిల్లీ, మే 8 – భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. “ఆపరేషన్ సిందూర్” నేపథ్యంలో దేశంలోని భద్రతా పరిస్థితులపై ప్రాధాన్యతతో చర్చించారు. ఈ భేటీలో పౌర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, తప్పుడు వార్తల ప్రచారాన్ని నియంత్రించడం, కీలక మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. “నిరంతర అప్రమత్తత, స్పష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు అత్యవసరం. కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట్ర స్థాయిలో ఉన్న సంస్థలతో సమన్వయంగా పనిచేయాలి” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భద్రత, ఆపరేషనల్ ప్రిపేర్డ్‌నెస్ మరియు పౌరుల రక్షణపై తన పూర్తి నిబద్ధతను మోదీ పునరుద్ఘాటించారు. అత్యవసర స్పందన చర్యలు, అంతర్గత కమ్యూనికేషన్ ప్రొటోకాల్స్ నిర్వహణపై ప్రతి శాఖ తన కార్యాచరణ ప్రణాళికను సమీక్షించాలన్నదిగా ఆయన సూచించారు. ఏఏ ప్రాంతాల్లో తక్షణ చర్యలు అవసరమో గుర్తించి, తగినంత సన్నద్ధత కలిగి ఉన్నట్లు తెలిపాయి. కేంద్ర మంత్రిత్వ శాఖలు ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని పీఎమ్‌ఓ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కేబినెట్ కార్యదర్శితో పాటు, ప్రధాని కార్యాలయం నుండి ఉన్నతాధికారులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొన్నారు. దేశ భద్రత అంశాల్లో సమగ్ర సమన్వయం, గట్టి చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.