Bhadrakali Temple : కాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శాకంభరీ నవరాత్రి మహోత్సవములు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం గం|| 04-00లకు నిత్యాహ్నికం పూర్తిచేసిన పిమ్మట అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని కాళ క్రమాన్ని అనుసరించి దీప్తా గాను షోడశీ క్రమాన్ని అనుసరించి జ్ఞానశక్తిని కులసుందరీ గాను అంకరించి పూజారాధనలు నిర్వహించారు. ఈ రోజు తిథి నవమికి అధిదేవత దుర్గ శంకరుడికి సమరంలో అమ్మవారు దుర్గగా సహకరిస్తూ విజయాన్ని చేకూరుస్తుంది. అందుకే రాజులు, చక్రవర్తులు యుద్ధాలకు వెళ్ళేముందు దుర్గను ఆరాధించి వెళ్ళేవారు. భారత యుద్ధం ప్రారంభానికి ముందు కూడా శ్రీ కృష్ణుడు అర్జునుడిని దుర్గను ప్రార్ధించమని చెప్తాడు. ఆ ప్రార్ధనలో అర్జునుడు చేసిన దుర్గాస్తుతిలో దుర్లను భద్రకాళిగా పలుమార్లు స్తుతిస్తాడు అర్జునుడు. అట్లాగే కాళీ క్రమాన్ని అనుసరించి దీప్తామాతగా అలంకరించబడిన అమ్మవారు జ్ఞానశక్తిని ఇస్తుంది. దీప్తా అనగా ప్రకాశింపజేయునది. సాధకునియందు అజ్ఞాన ఆవరణమును తొలగించి జ్ఞానము ప్రసాదింపజేసి ఇహపరసౌఖ్యములిచ్చునది దీప్తా. ఈమెయే దుర్గా. దుర్గతిని నశింపజేయు కాళియొక్క నామాంతరమే దుర్గ. వాణి, లక్ష్మీ, కాంతి, సిద్ధుల నిమిత్తం ఈ దేవతలను ఆరాధించాలని శాస్త్రాలు చెబుతున్నాయని ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. అట్లాగే షోడశీ క్రమాన్ననుసరించి అమ్మవారి ఉత్సవమూర్తులలో జ్ఞానశక్తిని కులసుందరీమాతగా అలంకరించి అర్చించారు. కులసుందరీమాత సకలైశ్వర్యాలతో కులవృద్ధిని జరుపుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు దేవాలయమునకు పోటెత్తారు. దర్శనమునకు వచ్చిన భక్తులకు క్యూన్ల ఏర్పాట్లు, మంచినీటి వసతి, ఉచిత ప్రసాద వితరణ తదితర ఏర్పాట్లు దేవాలయ ధర్మకర్తలు శ్రీ తొనుపునూరి వీరన్న, శ్రీ బింగి సతీష్, శ్రీమతి మోతుకూరి మయూరి రామేశ్వర్రావు, శ్రీమతి నార్ల సుగుణ, శ్రీమతి గాండ్ల స్రవంతి, శ్రీ అనంతుల శ్రీనివాస్, ఈ.ఓ శ్రీమతి శేషుభారతిలు పర్యవేక్షించారు.