MayDay : మేడే స్పూర్తితో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా గురువారం వరంగల్ తమ్మెర భవన్లో ఘనంగా మేడే సిపిఐ జిల్లా కార్యాలయం ఎదుట అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి, ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టారని అన్నారు. దేశ సంపదను తన కార్పొరేట్ మిత్రులకు మోడీ కట్టబెడుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను రోడ్డున పడవేస్తున్నారని అన్నారు. కార్మికులు ఉద్యమించకుండా కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను కాలరాశారని అన్నారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కాపాడుకునేందుకు, కార్పొరేట్ శక్తుల శ్రమ దోపిడీని అరికట్టేందుకు కార్మిక వర్గం మేడే స్పూర్తితో ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ కె బాష్మియా, సీపీఐ జిల్లా నాయకులు దండు లక్ష్మణ్, గుండే భద్రి, సంగి ఎలేందర్, లాయాదెల్ల శరత్. తదితరులు పాల్గొన్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్