ఫార్ములా ఈ కార్ రేసు పై విచారణ కక్ష సాధింపులే – డాక్టర్ తాటికొండ రాజయ్య
DR Thati Konda Rajayya : ప్రజలను తప్పు దోవ పట్టించడానికి విచారణల పేరు మీద రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు అని తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఫార్ములా ఈ కార్ రేసు అంశంపై జరుగుతున్న విచారణను తీవ్రంగా ఖండించారు. ఈ విచారణలు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యలే అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
ఫార్ములా ఈ కార్ రేసు ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షితమయ్యాయి. అమర్ రాజా బ్యాటరీ లాంటి ప్రముఖ సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈవెంట్ ద్వారా తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయంగా విస్తరించింది. కానీ ఇప్పుడు ఆ ప్రయోజనాన్ని తుంచేసేలా తప్పుడు కోణంలో విచారణలు జరపడం బాధాకరం.
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్వహించిన అందాల పోటీ వల్ల రాష్ట్రానికి ఏ ప్రయోజనం జరిగిందో ప్రజలకు తెలియజేయాలి. పైగా ఆ ఈవెంట్ సందర్భంగా జరిగిన అసభ్య సంఘటనల వల్ల తెలంగాణ పరువు ప్రపంచవ్యాప్తంగా నశించింది. ఆయన సన్నిహితులు మహిళలతో ప్రవర్తించిన తీరుపై ఇప్పటికీ సమాధానం లేదు అని డాక్టర్ రాజయ్య మండిపడ్డారు. రేవంత్ రెడ్డి,నువ్వెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ లేదా కేటీఆర్ కానీ ఏమాత్రం భయపడరు. మేము ప్రజల పక్షాన నిలబడి ప్రతి పక్షంగా నిరంతరం పోరాడుతూనే ఉంటాం అన్నారు. ఇప్పటికైనా ఈ డైవర్ట్ పాలిటిక్స్ మానేసి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం వైపు దృష్టి సారించండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.