Ration rice : వరంగల్ నగరంలో ఏ గల్లీలో చూసిన ఐదు రోజులుగా జనం బారులు తీరి కనిపిస్తున్నారు. ఉదయం రాత్రి అని తేడా లేకుండా లైన్లో నిలబడుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారా ప్రభుత్వం మూడు నెలల రేషన్ సన్న బియ్యం ఇస్తుండడమే ఇందుకు కారణం. హనుమకొండ వరంగల్ కాజీపేట పట్టణాల్లో రేషన్ షాప్ లో ఎదురుగా ఈనెల 1వ తేదీ నుంచి ప్రజలు బారులు తీరి రేషన్ కోసం వేచి చూస్తున్నారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం ఇవ్వడంతో పాటు వర్షాకాలం నేపథ్యంలో జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఈ నెలలోనే ఇస్తుండడంతో పేదలు తీసుకునేందుకు బార్లు తీరుతున్నారు. అయితే మూడు నెలల రేషన్ ఒకేసారి తీసుకోవడానికి ఒక్కో లబ్ధిదారుడు సుమారు 6 సార్లు తంబు పెట్టాల్సి రావడంతో రేషన్ షాపుల్లో ఆలస్యం అవుతుంది. దీంతో ఒక్కొక్కరికి సుమారు 20 నిమిషాల పైన సమయం తీసుకుంటున్నారు. బియ్యం అయిపోతాయేమోనని ఆందోళనతో ప్రజలు లైన్లలో వేచి చూస్తూనే ఉన్నారు.
కొన్ని జిల్లాల్లో ఇలా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో డీలర్లు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నరని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా నెలకు మూడు కిలోల బియ్యం కటింగ్ చేస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు కొన్ని షాపులలో రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పేదల కోసం ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా డీలర్లు కొంతమంది వ్యక్తులు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. రేషన్ బియ్యం పేదలకు పూర్తిస్థాయిలో అందేలా సంబంధిత అధికారులు దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.