Bhadrakali Temple : వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శాకంభరీ నవరాత్రి మహోత్సవములు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 04-00 గం లకు నిత్యాహ్నికం నిర్వహించిన పిమ్మట దీక్షా హెూమం జరిపి చతుస్థానార్చన పూర్తిచేసిన అనంతరం తిథిమండల దేవతాయజనంలో భాగంగా అమ్మవారి షడ్బేరాలలో జ్ఞానశక్తిని కాళీ క్రమాన్ని అనుసరించి కపాలినీ మాతగాను క్రియాశక్తిని షోడశీ క్రమాన్ని అనుసరించి భగమాలినీ మాతగాను అలంకరించి పూజారాధనలు జరిపారు. కపాలినీ మాత సృష్టిని అసురీ శక్తుల విధ్వంసం నుండి కాపాడుతుంది. పైశాచిక శక్తులను సంహరించి అసురీ శక్తులపై దైవీ శక్తుల విజయ సంకేతంగా రాక్షసుల కపాలాలను మాలగా ధరిస్తుంది. భగమాలిని మాతను బ్రాహ్మీ శక్తి అని కూడా అంటారు. ఈ భగమాలినీమాతను ఉపాసించడం వల్ల సత్సంతానసౌభాగ్యాలు కలుగుతాయి. అంతేగాక విదియ తిథికి అధిదేవతయైన బ్రహ్మ ఉపాసన కూడా జరుపబడింది. బ్రహ్మ యజనం కూడా జరిగింది. ఈ రోజు శుక్రవారం కూడా కావడంతో భక్తులు వేలాదిగా అమ్మవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చారు. వచ్చిన భక్తులకు ఉదయం, సాయంత్రం పూజానంతరం ప్రసాద వితరణ జరుపబడింది. ఈ రోజు ఆలయాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఎం.ఎల్.ఏ రాజేందర్ రెడ్డి కి ఆలయ చైర్మన్ డా॥ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు టి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరిరామేశ్వర్రావు, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగు ఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్ రావు, ఈ. ఓ శ్రీమతి శేషుభారతి, ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. పూజానంతరం ఎం.ఎల్.ఏ కి మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందచేసారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్