Bhoobharathi: భూ భారతి చట్టంలో ప్రతి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని.. రైతులకు భూ భారతి చట్టం శ్రీరామరక్ష అని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
భూ భారతి – 2025 చట్టం పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా మంగళవారం వరంగల్ పట్టణంలోని నాని గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన భూభారత్ చట్టం అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద , జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే లతో కలసి పాల్గొన్నారు.
సభా ప్రారంభానికి ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంపై ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. ఈ అవగాహన సదస్సులో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టంలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించగా అందులోని అంశాలను జిల్లా కలెక్టర్ సత్య శారద కూలంకషంగా వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూరాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి దేశంలోని 18 రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించామని, దేశానికి రోల్ మోడల్ గా భూభారతి చట్టాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకు వచ్చామని అన్నారు. రైతుల వారసత్వంగా వచ్చే భూమిలో అనుభవించలేక అనేక సమస్యలు ఏర్పడ్డ ఈ ధరణి నుంచి చిన్న చిన్న సమస్యలు మార్చుకొనుటకు ప్రతిదీ కోర్టు ద్వారా పరిష్కరించుటకై నిరుపేద రైతులకు సాధ్యం కాలేదని, కానీ ప్రస్తుతం ఉన్న ప్రజా పాలన ప్రభుత్వ రైతు శ్రేయస్సు కోసం సమస్యలు పరిష్కరించుటకు రెండంచల వ్యవస్థను తీసుకువచ్చి రైతులకు అండగా నిలిచిందని అన్నారు. భూ భారతి చట్టం రైతుల పాలిట భద్రత నేస్తం అని అన్నారు.
ఈ సభాముఖంగా రైతులైన కొంగరి భాస్కరరావు, విజయ్ కుమార్, గోపాల రాధాకృష్ణ గార్ల యొక్క సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని పరిష్కరించుటకు మంత్రిగారు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని భూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చామని, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి అద్భుతమైన చట్టాన్ని అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు ఉపయోగపడే విధంగా చట్టాలను అమల్లోకి తీసుకువస్తుందన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ చట్టాలను అందులోని అంశాలను పరిశీలించి, రాష్ట్రవ్యాప్తంగా మేధావులు, రైతులు సలహాలు సూచనలతో రూపొందించిన మార్గదర్శకాలతో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. దేశం లోనే భూ సమస్యల పరిష్కారం కోసం అద్భుతమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ చట్టంలో ఫలితాలను చూడాలని రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినట్లు తెలిపారు. భూభారతి చట్టం పై రాష్ట్రం లోని అన్నీ మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యలు ఉన్న మీ ఇంటి వద్దకే రెవెన్యూ అధికారులను పంపించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి వాటిని పరిష్కరిస్తారని అన్నారు.
2020లో వచ్చిన ధరణి చట్టానికి భూ సమస్యలను పరిష్కరించే ఎలాంటి రూల్స్ లేవన్నారు. ప్రతి భూ సమస్య పరిష్కారానికి భూభారతి చట్టంలో మార్గాలు ఉన్నాయన్నారు. సాదా బైనమా అంశాలను ధరణిలో పొందు పరచలేదన్నారు. ధరణి విషయమై భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టుల వరకు వెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్రంలో అప్పుల భారం ఉన్నా కూడా పేదవాడి కలను సాకారం చేసేందుకు నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. పేదవారికి చెందిన భూమిని పేదవారికే ఇచ్చేందుకు భూ భారతి చట్టం తోడ్పడుతుందన్నారు.
ఏ ఒక్క నిరుపేద రైతన్న ఏ ఆఫీస్ చుట్టూ తిరిగినవసరం లేదని, మీ ముందుకే అధికారులు వస్తారని అన్నారు. రైతులకు ఒక్క పైసా కూడా ఖర్చు లేనివిధంగా భూ భారతి చట్టం ద్వారా భూ సమస్య పరిష్కారానికి ఉపయోగ పడుతుందన్నారు. అప్లికేషన్ ఫారాన్ని అధికారులే అందజేస్తారని అన్నారు. భూ సమస్యలు శాశ్వతంగా.. సులువుగా పరిష్కారమయ్యే విధంగా భూభారతి చట్టం రూపొందించినట్లు చెప్పారు. ఈనెల 30 వరకు అన్ని మండలాల్లో భూభారతి చట్టంపై రైతు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో పైలెట్ గా ఒక మండలాన్ని ఎంపిక చేసుకొని భూ భారతి చట్టం ద్వారా పరిష్కార మార్గాలను అధికారులు తెలియజేస్తారన్నారు. జూన్ రెండవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ప్రభుత్వం మండలాల్లో భూభారతి చట్టం సదస్సును నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జూన్ మూడవ తేదీన ప్రతి రెవెన్యూ గ్రామానికి ప్రతి భూ సమస్యల పరిష్కారానికి చట్టం ద్వారా అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో చట్టాలను అమలు చేసే బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలులో అధికారులు ఎలాంటి తప్పులు చోటు చేసుకోకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అధికారులు ఎక్కడైనా తప్పు చేసినట్లయితే చర్యలు ఉంటాయన్నారు. సాదా బైనామా దరఖాస్తులను కూడా భూభారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. భూభారతి చట్టం ద్వారా పేద ప్రజలకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకువచ్చిన భూభారతి చట్టం రైతుల చుట్టమని పేర్కొన్నారు. న్యాయమైన ప్రతి సమస్యను అధికారులు పరిష్కరించాలని సూచించారు.
రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, 20 లక్షల ఇళ్లను కట్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. మొదటి విడతలో నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం అత్యంత నిరుపేదలకు అందిస్తుందన్నారు. తమది పేదల ప్రభుత్వం అని పేర్కొన్నారు. పేదవాడి ప్రభుత్వము. సన్న బియ్యం మాదిరిగానే భూభారతి చట్టంతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని ఎన్ని ఇబ్బందులు ఉన్నా అంకితభావంతో ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆచరణీయంగా అమలు చేస్తున్నామని, మహాలక్ష్మి పథకం ద్వారా ఆడపడుచులను ఉచితంగా ప్రయాణం కల్పించిందని, గృహలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకే సిలిండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల బీమా పెంపు, సన్న బియ్యం పథకం ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాలను ప్రజల వద్దకు తీసుకువచ్చి అర్హులైన లబ్ధిదారులకు అందించే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అన్నారు.
రైతుల సన్న బియ్యం పంటకి 500 రూపాయలు బోనస్ ప్రకటించి రైతన్నకు నేస్తంగా నిలిచిందని అన్నారు.
రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి. *శ్రీమతి కొండ సురేఖ మాట్లాడుతూ ఆత్యంత ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరినప్పుడే దానికి సార్ధకత ఏర్పడుతుందని అన్నారు. రైతులు, ప్రజల మేలు కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో జిల్లాలోని అన్ని మండలాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు – భూ భారతి చట్టం అని ఈ చట్టం లో హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ ,పెండింగ్ సాదాబైనామా ధరఖాస్తుల పరిష్కారం అవకాశం ఉందన్నారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయాలని, భూమి హక్కులు మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదుకు, పాసు పుస్తకాలలో భూమి పటం ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. భూ సమస్యల పరిష్కారనికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ, వ్యక్తికి ఆధార్ భూమికి భూధార్ కార్డుల జారీ చేస్తున్నట్లు చట్టంలో ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి మాట్లాడుతూ భూభారతి చట్టం ఎంతోమంది మేధావులు, రైతులు, ఎన్నో వర్గాల అభిప్రాయాలు, ఆలోచనల మేరకు చేసినదే ఈ చట్టం అని అన్నారు. ఈ చట్టం వందేళ్లు వర్ధిల్లుతుందని అన్నారు.భూ సమస్యల పరిష్కారానికి ఈ చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. రైతులు, ప్రజలు ఈ చట్టంపై పూర్తి అవగాహనను పెంపొందించుకోవాలని కోరారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ రైతులకు భూమి అంటే ఆత్మగౌరవం, విశ్వాసమని అన్నారు.రైతుకు భూమికి విడదీయని బంధం ఉంటుందన్నారు. రైతులకు అనేక సందర్భాలలో భూమి అండగా ఉంటుందన్నారు. ధరణి పోర్టల్ తీసుకురావడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులతో పాటు వరంగల్, ఖిలా వరంగల్ మండలాల్లోని రైతులు, ప్రజలు పాల్గొన్నారు.