Big Cover Shed Opening : ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 21 వేల కోట్ల రుణ మాఫీ, గడిచిన 9 రోజులలోనే సుమారు 60 లక్షల మంది రైతులకు 9 వేల కోట్ల రైతు భరోసా అందించి కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రం శివునిపల్లిలోని వ్యవసాయ మార్కెట్ నందు 2 కోట్ల 12 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆధునిక బిగ్ కవర్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బం గా శిలాఫలాకాన్ని ఆవిష్క రించి ఆధునిక బిగ్ కవర్ షెడ్డును ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ మైనారిటీ మహిళా పథకం ద్వారా 13 మంది క్రిస్టియన్ మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అలాగే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 87మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 24లక్షల 78వేల 500 రూపా యల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ ను మరింత అభివృద్ధి చేయాలని మార్కెట్ కమిటీకి, అధికారులకు సూచించారు. మార్కెట్ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలని అప్పుడే రైతులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అన్నారు. రైతులకు వ్యవసాయ సంబంధిత సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, విత్తనాలు, ఎరువులు మార్కెట్ ఆవరణలో అందుబాటులో ఉంచాలని, అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వం తరపున, నా తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.