పార్టీకి సేవ చేసిన వారికి గుర్తింపు, పదవులు …
పార్టీ పట్ల నిర్లక్ష్యం వహిస్తే పక్కకు తప్పించడమే గమ్యం…
– డీసీసీపి,ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
Congress party : హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించేందుకు పూర్తి స్థాయి ప్రక్షాళన అవసరమని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు స్పష్టం చేశారు. సోమవారం రోజున హనుమకొండలోని కాంగ్రెస్ భవన్ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పార్టీ సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, “రానున్న రోజుల్లో పార్టీ కోసం నిజంగా కష్టపడిన వారికే బాధ్యతలు, పదవులు లభిస్తాయి. నిజాయితీగా పనిచేసే కార్యకర్తలను గుర్తించి వారిని ప్రోత్సహించడమే నా ప్రధాన లక్ష్యం. వారికోసం భారీగా బహుమతులు కూడా ప్రకటిస్తాను,” అని అన్నారు.
పార్టీలో క్రమశిక్షణను పాటించడమే ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన, వ్యతిరేక స్వరాలు వినిపిస్తే ఏమాత్రం సహించేది లేదన్నారు. “ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం లభించాల్సిందే. అయితే, పదవుల్లో ఉన్నప్పటికీ కార్యకలాపాల్లో ఆసక్తి చూపని వారిని పక్కకు తప్పించడం తప్పదని” స్పష్టంగా చెప్పారు. తనపై వ్యక్తిగతంగా నష్టం చేసిన వారిని పరిగణనలోకి తీసుకోనన్న ఆయన, పార్టీకి నష్టం కలిగించే చర్యలను మాత్రం ఏ మాత్రం ఉపేక్షించబోనని హెచ్చరించారు. 10 ఏళ్లలో ఎన్నో కష్ట నష్టాలకు,అక్రమ కేసులకు ఒరుచుకొని నిలబడినామని నాయకులు కాస్త ఓపిక పడితే పదవులు వస్తాయని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో పీసీసీ సభ్యులు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, యువజన నాయకులు, డివిజన్ అధ్యక్షులు బూత్ స్థాయి కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.