Lok Adalath : వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు ఉన్నవారికి ఊరట కలిగించే అవకాశం లభించింది. జూన్ 9 (సోమవారం) నుండి జూన్ 14 (శనివారం) వరకు వరంగల్ 2వ తరగతి న్యాయస్థానంలో “లోక్ అదాలత్” నిర్వహించబడుతోంది. ఇందులో డ్రంకెన్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన కేసులు, అలాగే మైనర్ డ్రైవింగ్ కేసులు ఉన్నవారు పాల్గొని తమ కేసులను త్వరితంగా పరిష్కరించుకోవచ్చు
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. రామకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించడానికి అవసరమైన డాక్యుమెంట్లను హాజరైన వారు వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
అవసరమైన డాక్యుమెంట్లు ఇలా ఉన్నాయి:-
• డ్రంకన్ డ్రైవింగ్ కేసుల వారికి: ఆధార్ కార్డ్ జిరాక్స్, వాహనపు డాక్యుమెంట్లు.
• డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినవారికి: ఆధార్ కార్డ్, మీ సేవా పోర్టల్ ద్వారా లైసెన్సు దరఖాస్తు చేసిన రశీదు.
• మైనర్ డ్రైవింగ్ కేసుల వారికి: పుట్టిన సర్టిఫికేట్ లేదా SSC మెమో.
ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా లభించతాయని, కేసు ఉన్న ప్రతి ఒక్కరు ఈ లోక్ అదాలత్ ద్వారా తమ కేసులను శాశ్వతంగా ముగించుకోవాలని ట్రాఫిక్ పోలీస్ శాఖ సూచిస్తోంది.