అవినీతికి తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక..
మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం..
indiramma home scheme : రానున్న స్థానిక సంస్థల ఎన్నిక లలో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా మనందరం సమిష్టిగా కలిసి పని చేద్దామని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. జఫర్గడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జఫర్గడ్ మండల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్బంగా కలెక్టర్ గారితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను, మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా మంజూరు అయిన 4కోట్ల 86లక్షల 40వేల రూపాయల రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు. అనంతరం జఫర్ గడ్ మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమా వేశంలో పిసిసి పరిశీలకులు లింగం యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ఆలోచన అంతా నియోజకవర్గ అభివృద్ధిపైనే ఉండాలని, మన సంకల్పానికి ఏదీ అడ్డు కాకూడదని వెల్లడించారు. ఎంత కలుపుకుపోవాలని చూసినా ఇంకా కొంత అభిప్రాయ బేధాలు ఉన్నాయని, వాటిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. నియోజక వర్గంలో మన బలం పెరిగిం దని, చిన్న చిన్న కారణాలతో బలహీనం చేసుకోవద్దని కోరారు. ఏఐసిసి, పిసిసి ఆదేశాల మేరకు పని చేసే వారు కావాలని తెలిపారు. నియోజకవర్గంలో భిన్న నాయకత్వాలకు చోటు లేదని, అలాంటి అవసరం కూడా లేదని పేర్కొన్నారు. నియోజక వర్గంలో 90శాతం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని, ఎక్కడా అవినీతి లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని ఇందుకు ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, గ్రామ, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పదవులు, పథకాలు అమ్ముకున్నారని, కానీ ఇప్పుడు అలా కాదని అన్నారు. ఎదుటి వారు తప్పుచేశారని మనం చేయవద్దని, మనం నిజా యితీగా పని చేద్దామని, పేదవాళ్లకు అందుబాటులో ఉంటూ వారికీ సహాయం చేద్దామని పిలుపునిచ్చారు. గ్రామాలలో అందరి సమన్వయం చేసుకొని సమిష్టి నిర్ణయంతో లబ్ధిదారుల ఎంపిక జరగాలని అన్నారు. వచ్చే మూడు ఏళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయని హామీ ఇచ్చారు. ఎక్కడా, ఎవరికీ లంచం ఇవ్వొద్దని సూచించారు.
పార్టీ పరిశీలకుల నిర్ణయం మేరకే పదవులు ఉంటాయని, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికీ అవకాశాలు వస్తాయని అన్నారు. అందుకు ప్రతీ ఒక్కరూ పార్టీ పరిశీలకులకు సహకరించాలని కోరారు. అందరిని కలుపుకొని సమన్వయం చేసుకోవాలని సూచించారు. నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేసే వారిని గ్రామ, మండల స్థాయిలో రాజకీయంగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. నిజాయితీగా పని చేసే వాళ్ళు మాత్రమే ముందుకు రావాలని తెలిపారు. మనందరం కలిసి నియోజకవర్గంలో, మండలం లో, గ్రామంలో పార్టీని బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో, తహసీల్దార్, ఎంపిడివో, ఇతర అధికారులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.